జలాలపై ‘‘కెసిఆర్’’ జగన్నాటకం: రేవంత్ రెడ్డి

వైఎస్ఆర్ ను తిట్టినా స్పందించని జగన్, విజయలక్ష్మీ
జగన్ ను దూషించని షర్మిల, కెసిఆర్
కాంగ్రెస్ ను తొక్కేందుకే షర్మిల ప్రయత్నం
వైఎస్ఆర్ కూడా రెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చాడు
హైదరాబాద్: వైఎస్ఆర్ కొడుకు ఏపి సిఎం జగన్మోహన్ రెడ్డి ని ప్రగతి భవన్ పిలిచి సిఎం కెసిఆర్ మర్యాద చేస్తరు, మరి అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఏందుకు తిడుతున్నారని పిసిసి అధ్యక్షుడు ఏ.రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.

కెసిఆర్ కు రాజకీయ ప్రయోజనాలు, కెటిఆర్ కు ఆర్థిక ప్రయోజనాల వల్లే మన రాష్ట్రానికి ఈ గతి పట్టిందన్నారు. జగన్ కు కెసిఆర్ అమ్ముడు పోవడం వల్లే జల వివాదాలు తలెత్తుతున్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. పరివాహక ప్రాంతాలకు నీళ్లు ఇవ్వకుండా… ఇతర ప్రాంతాలకు నీళ్లు తరలించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు. రెండు ప్రాంతాల ప్రజలను రెచ్చగొట్టి ఇరు వర్గాలు లబ్ది పొందుతున్నాయని ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు 11టిఎంసి ల నీరు జగన్ ప్రభుత్వం తరలించబోతుందన్నారు. కాని తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా రోజుకు 1 టిఎంసి కు మించి నీరు తరలించడం లేదు. జూరాలలో మనకు కనిపించిన నీరు… సంగంబండ తర్వాత కన్పించదన్నారు. సంగంబండ దగ్గర జలదోపిడి జరుగుతుంది.. దానికి ప్రధాన కారకుడు కెసిఆర్ అని స్పష్టం చేశారు. కృష్ణా నది నుండి ఏపి ఎన్ని నీళ్లు తీసుకోబోతుందో స్పష్టంగా అసెంబ్లీ లో జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత ప్రగతి భవన్ లో జగన్ కు కెసిఆర్ అథితి మర్యాదలు చేశారన్నారు. ప్రగతి భవన్ లో కేసీఆర్ తో జగన్ సమావేశం తర్వాతే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల్లో వేగం పెంచారు. ఇరు రాష్ట్రాల మధ్య నీటి సమస్యను పరిష్కరించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ ను ఏర్పాటు చేసింది. అయినా తెలంగాణ ప్రభుత్వం పట్టనట్లే ఉందని రేవంత్ అన్నారు.
తెలంగాణ వ్యక్తి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసువేస్తే… ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఇంప్లీడ్ పిటిషన్ వేసిందన్నారు. కృష్ణా బేసిన్ నీళ్ళను పెన్నా బేసిన్ నీళ్ళను తరలిస్తుంటే… వాదించడమే రాని అడ్వకేట్ రాంచందర్ రావు ను నియమించారు. ఎన్.జి.టి లో సమర్దవంతమైన వాదనలు వినిపించకుండ పోవడం వల్ల ఇప్పుడు మనకు ప్రమాదం వచ్చిందన్నారు. తెలంగాణలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పై పోలీసులెందుకు పెట్టారు, ఎవరిని రెచ్చగొట్టడం కోసం ఈ నాటకమని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ లో ఉన్న సెటిలర్ల కోసమే గట్టిగా మాట్లాడట్లేదంటున్న జగన్, తన తండ్రి వైఎస్ఆర్ ని నరరూప రాక్షసుడు, దొంగ అని తెలంగాణ మంత్రులు తిడితే నోరు మెదపని వాడు ఏపీ కి ఏం న్యాయం చేస్తాడని విమర్శించారు.

వైఎస్ఆర్ ను తిడితే అటు జగన్, ఇటు విజయలక్ష్మీ ఒక్కరు కూడా నోరు మెదపకపోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ కు జరుగుతున్న అన్యాయంపై సిఎం జగన్ ను కేసిఆర్, వైఎస్.షర్మిల ఏందుకు నిలదీస్తలేరో గమనించాలన్నారు. జలవివాదాలతో రెండు రాష్ట్రాల్లో లబ్ది పొందేందుకు జగన్, కెసిఆర్ వేసిన స్కెచ్ ఇది అని అన్నారు. కృత్రిమ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.
పార్లమెంట్ సమావేశాల్లో కృష్ణా నది జలాల పై టిఆర్ఎస్ విధానం ఏంటో చెప్పడం లేదన్నారు. మా ఎంపీ లను ఓప్పించి నేను పోరాడుతానన్నారు. ఏ సెంటిమెంట్ తో అయితే గద్దెనెక్కిండో అదే సెంటిమెంట్ తో అధఃపాతాలానికి పోతాడని హెచ్చరించారు. నీళ్లు, నిధులు, నియామకాలు.. ఈ మూడే కెసిఆర్ ను గద్దె దించుతాయని ఆయన స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీ లకు వెళ్లిన నేతలు తిరిగి కాంగ్రెస్ వైపు రాకుండా చేసేందుకు వైఎస్.షర్మిల ను పావుగా వాడుతున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ కూడా రెడ్డి కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వాడే.. ఈ విషయం తెలుసుకుని షర్మిల మాట్లాడితే బాగుంటుంది. జులై 8 వైఎస్ఆర్ పుట్టినరోజు సందర్భంగా షర్మిల తెలంగాణ లో పార్టీ ప్రారంబించబోతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ అంటే తెలంగాణ లో రైతులు గుర్తుకు వస్తారు.. అంతే గాని తెలంగాణలో ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని అనుకుంటే కుదరదన్నారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ అంటే సంక్షేమం గుర్తుకు వస్తుంది. అలాంటి వారిని తిడితే కుష్ఠురోగం వస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.