ఆ తల్లికి కడుపు కోత ఇంకా ఎన్నాళ్లు! కుటుంబ సభ్యుల కన్నీటి వేదన…

గురజాల : ఆ తల్లి కడుపుకోతకు ఏడాది పూర్తయింది. బాలుడు అన్నపురెడ్డి సుభాష్‌(4) ఆచూకీ నేటికీ లభ్యం కాలేదు. బాలుని తల్లి వెంకటలక్ష్మి అప్పటి నుంచి ఆమె ఆవేదన వర్ణణాతీతం. ఎక్కడున్నాడో.. తెలియదు.. ఏం చేస్తున్నాడో తెలియదు... అసలున్నాడో.... లేడో కూడా తేలడం లేదు. ఆ తల్లికి సమీపంలో చిన్న పిల్లల నవ్వులు వినిపించినా తన బిడ్డమోనని ఉలిక్కపడి లేస్తోంది. కాసేపటి దాకా రోదిస్తూ కన్నీటి పర్యంతమవుతోంది.ఏం జరిగింది: 2019 ఆగస్టు 25న ఉదయం 10 గంటల సమయంలో ఇంటి వద్ద నుంచి అన్నపురెడ్డి సుభాష్‌ తప్పిపోయాడు. పలు చోట్ల గాలించినా ఎక్కడా ఆచూకీ లభించక పోవడంతో తండ్రి గురవయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అదృశ్యం కేసు నమోదు చేశారు. 30న ఇంటి సమీపంలోని గడ్డివాముల ప్రాంతంలో సుభాష్‌ వేసుకున్న చొక్కాకు రక్తపు మరకలు, ఎముకలు కనిపించాయి. పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. ప్రస్తుత పరిస్థితి: ఏడాది గడిచినా కేసులో ఎలాటి పురోగతి లేదు. బాలుని తల్లిదండ్రులు పోలీసుస్టేషన్‌కు వెళ్లి కేసు గురించి వాకబు చేస్తున్నారు. జిల్లా పోలీసు అధికారులను సైతం కలిసి వినతులు అందజేశారు. అయినా ఎలాంటి పురోగతి కానరావడం లేదు. మా అబ్బాయి ఉన్నాడా... చనిపోయాడా...లేకుంటే ఎక్కడున్నాడో తేల్చాలని బాలుని తల్లి వెంకటలక్ష్మి వేడుకుంటోంది. పాలిగ్రాఫ్‌ పరీక్షకు పంపాల్సి ఉంది: ఆర్‌.శ్రీహరిబాబు, డీఎస్పీ, గురజాల బాలుని అదృశ్యం కేసుకు సంబంధించి పాలిగ్రాఫ్‌ పరీక్ష చేయించాలని కోర్టులో పిటిషన్‌ వేశాం. అనుమానితులను పరీక్ష చేసిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటాం. మొదట బాలుడు కనిపించడం లేదని, తరువాత కొన్ని ఆధారాలతో హత్యకేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. కోర్టు నుంచి అనుమతులు తీసుకొని కేసు దర్యాప్తు కొనసాగిస్తాం.

Leave A Reply

Your email address will not be published.