ఈరోజు మళ్లీ ఈడీ విచారణకు కవిత..
-
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరోసారి విచారణకు హాజరవుతున్న కవిత
-
ఈనెల 11న 9 గంటల సేపు కవితను ప్రశ్నించిన ఈడీ
-
కవితను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ ప్రచారం
-
కేటీఆర్, హరీశ్ ఢిల్లీకి పయనం
-
బి.ఆర్.ఎస్ నాయకుల్లో ఉత్కంఠ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈరోజు మరోసారి ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆమె ఈడీ కార్యాలయానికి చేరుకోనున్నారు. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక నిందితుడిగా ఉన్న లిక్కర్ వ్యాపారి రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది.
ఈ నెల 11న కవితను ఈడీ తొలిసారి ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దాదాపు 9 గంటల సేపు ఆమెపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. 16న మళ్లీ విచారణకు హాజరుకావాలని కవితకు నోటీసులు ఇచ్చారు. అయితే, ఈడీ అధికారులు తనను వేధిస్తున్నారని… విచారణ నుంచి తనకు మినహాయింపును ఇవ్వాలని సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేశారు. అయితే ఆమె అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో, ఈరోజు ఈడీ విచారణకు కవిత హాజరవుతున్నారు.
మరోవైపు, కవితను ఈడీ రెండోసారి విచారించనున్న నేపథ్యంలో బి.ఆర్.ఎస్ వర్గాలల్లో ఉత్కంఠ నెలకొంది. ఆమెను అరెస్ట్ చేస్తారనే ప్రచారం ఓకవైపు జరుగుతోంది. ఇంకోవైపు, తన చెల్లెలు కవితకు తోడుగా ఉండేందుకు కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు నిన్న సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు మరికొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎంపీలందరూ ఢిల్లీలోనే ఉన్నారు. బీఆర్ఎస్ కీలక నేతలు ఢిల్లీకి చేరుకోవడంతో ఏం జరగబోతోందనే ఉత్కంఠ మరింత పెరుగుతోంది. కవితను అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నాకు దిగే అవకాశాలున్నాయని వినికిడి చూడాలి కవిత విచారణ ముగుస్తుందా? లేక మరోసారి ఈడీ విచారణకు పిలుస్తుందా ? కవిత అరెస్ట్ అయితే ఢిల్లీలో పరిణామాలు ఎలా ఉంటాయోనని తెలంగాణ లో ఉత్కంఠ నెలకొంది