ఏపీ, తెలంగాణలో నేడు, రేపు విస్తారంగా వర్షాలు.

 

  • అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణశాఖ

  • ఏపీలో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం

  • తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొనసాగుతున్న ద్రోణి  

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల విస్తారంగా, మరికొన్ని చోట్ల వడగళ్ల వానలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి వర్షాకాలాన్ని తలపిస్తోంది. రెండు రాష్ట్రాల్లోనూ వర్షాలు ఇంకా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నేడు, రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

ఏపీలో పలు చోట్ల పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆది,సోమవారాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్ తీరం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని, వర్షాలకు ఇదే కారణమని వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, అల్లూరి సీతారామరాజు, మన్యం, అనకాపల్లి, కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మేడ్చల్ మల్కాజ్గిరి  , హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, వరంగల్, హనుమకొండ, సంగారెడ్డి జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని తెలిపింది. ఇప్పటికే పలు జిల్లాలో వర్షం ప్రారంభమైనది. ఈ వర్షానికి అనేక ప్రాంతాల్లో పంట నష్టం జరిగింది. వరి పంటకు అపార నష్టం జరిగింది. మామిడి పిందెలు రాలడం జరిగింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి వర్షం కురుస్తుంది.

Leave A Reply

Your email address will not be published.