జగదేవపూర్ కేంద్రంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం

 

తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు జగదేవపూర్ మండల కేంద్రంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ లో పేపర్ లీక్ వ్యవహారంలో దొషులను కఠినంగా శిక్షించాలని, మంత్రి కేటీఆర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జగదేవపూర్ మండలంలోని చత్రపతి శివాజీ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ లో వెలుగులోకి వస్తున్న పేపర్ లీకేజి కుంభకోణం వల్ల నేడు తెలంగాణ రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది నిరుద్యోగులు ఈ రోజు తమ విలువైన సమయాన్ని కోల్పోయారని, అందుకు కారణమైన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ ఛైర్మన్ ను వెంటనే విధుల నుండి తప్పించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా నైతిక బాధ్యత వహిస్తూ కేటీఆర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

పేపర్ లీకేజి విషయంలో నిందితులను శిక్షించాలని శాంతియుత పోరాటం చేయాలని, నిరుద్యోగుల విషయంలో న్యాయం జరిగే వరకూ, టి‌పి‌సి‌సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని, అదే విధంగా 2024లో నూతన ప్రభుత్వం ఏర్పడగానే ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ తరపున హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువకులు ఆత్మహత్యలు చేసుకోకుండా, పోరాట స్పూర్తితో, తెలంగాణ ఉద్యమ స్పూర్తి తో ఉండాలని భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రావణ్‌కుమార్, బిజి వెంకటపూర్ ఉపసర్పంచ్ శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అజీజ్, రూపేష్, కృష్ణ, లోకేష్, భాను మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.