కేసీఆర్ కుటుంబంపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు!

సీఎం కేసీఆర్ కుటుంబంపై తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ‘కరోనా’ కారణంగా కేసీఆర్ ఫ్యామిలీకి కనకవర్షం కురుస్తోందని, కేసీఆర్ బంధువు డైరెక్టర్ గా ఉన్న ఫార్మా కంపెనీకి రూ.140 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆరోపించారు. పాకాల రాజేంద్రప్రసాద్ డైరెక్టర్ గా చేరిన రాక్సెస్ లైఫ్ సైన్స్ కి కొన్ని రోజులకే వందల కోట్ల రూపాయలు వచ్చాయని, ఇప్పుడు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఉత్పత్తి కోసం రూ.10 వేల కోట్ల ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు.

ఈ సంస్థకు కేంద్రంతో ఒప్పందం కోసం కేసీఆర్, కేటీఆర్ లు మధ్యవర్తిత్వం చేశారని ఆరోపించారు. వేల కోట్ల రూపాయల ఎగుమతులు చేసే, లక్షల రూపాయల ట్యాక్స్ లు కట్టే ఫార్మా కంపెనీలకు కాకుండా ఇలాంటి అర్హత లేని కంపెనీతో ఒప్పందం ఎలా కుదిరింది? అని ప్రశ్నించారు. తన బంధువుల కోసం రాష్ట్రాన్ని కేంద్రం దగ్గర పణంగా పెట్టి ఒప్పందం చేశారని ఆరోపించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ, బీజేపీపైనా ఆయన విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్, బీజేపీ వేర్వేరు కాదని, ఆ రెండూ ఒకటేనని విమర్శించారు. అర్హత లేని కంపెనీలతో ఒప్పందం ఎలా చేసుకున్నారో చెప్పాలని బీజేపీని డిమాండ్ చేశారు.
Tags: Revanth Reddy, Congress, KCR TRS, Corona Virus

Leave A Reply

Your email address will not be published.