కరోనా వాక్సిన్ కోసం ప్రపంచ నేతల వితరణ రూ. 60,840 కోట్లు… ఒక్క రూపాయి కూడా ఇవ్వబోమన్న అమెరికా!

పలు అభివృద్ధి చెందిన దేశాధి నేతలు, వరల్డ్ ఆర్గనైజేషన్స్, కరోనాపై పోరులో వాక్సిన్ తయారీకి భారీ ఎత్తున నిధులను అందించేందుకు అంగీకరించగా, అమెరికా మాత్రం ఒక్క పైసా కూడా ఇవ్వబోమని స్పష్టం చేసింది. కరోనా వాక్సిన్ తయారీ, ట్రీట్ మెంట్ నిమిత్తం పేద దేశాలకు సాయం చేసేందుకు 8.1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 60,840 కోట్లు – మంగళవారం నాటి ఆర్బీఐ రిఫరెన్స్ రేటు రూ. 76.1150 ప్రకారం) ఇచ్చేందుకు అంగీకరించాయి.

యూరోపియన్ యూనియన్, బ్రిటన్, నార్వే, సౌదీ అరేబియా, జపాన్, కెనడా, సౌతాఫ్రికా, చైనా తదితర దేశాల నేతలు, ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. వరల్డ్ బ్యాంక్, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్, ఇతర ప్రపంచ కుబేరులు సైతం ఈ నిధికి తమవంతు సాయం చేసేందుకు అంగీకరించారు. దీని ఫలితంగా 8.1 బిలియన్ డాలర్ల నిధి సిద్ధం కానుందని యూరోపియన్ కమిషన్ హెడ్ ఉర్సులా వాండర్ లీయన్ వ్యాఖ్యానించారు. ప్రపంచ సహకారంతోనే ఈ ప్రాజెక్టు ముందడుగు వేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.

కాగా, అమెరికా మాత్రం ఈ కాన్ఫరెన్స్ కు దూరంగా ఉంది. ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు నిధులను నిలిపివేయాలని నిర్ణయించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కరోనా వైరస్ పై ఇతర దేశాలను ముందస్తుగా హెచ్చరించడంలో విఫలమైన చైనాకు డబ్ల్యూహెచ్ఓ అండగా నిలిచిందని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక, ఈ సమావేశానికి హాజరు కాకపోవడం, నిధులు ఇవ్వబోమని అనడంపై స్పందించిన నార్వే ప్రధాని ఎర్నా సోల్ బెర్గ్, అమెరికా నిర్ణయం హర్షించ తగినది కాదని అన్నారు. కరోనా వాక్సిన్ ను ఎవరు అభివృద్ధి చేసినా, భారీ ఎత్తున ఉత్పత్తికి సహకరిస్తూ, తాము బిలియన్ డాలర్లను సాయం చేస్తామని ఈ సందర్భంగా ఎర్నా వ్యాఖ్యానించారు.
Tags: EU Commission,Corona Virus,Vaccine,Funds,USA

Leave A Reply

Your email address will not be published.