టీడీపీ మీటింగ్ లో ఉపాధ్యాయుడు…ఆ వెంటనే సస్పెన్షన్ వేటు.
కృష్ణా: మరో రెండు నెలల్లో పదవీ విరమణ చేయనున్న జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడు వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌తో కలిసి టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌కు ఉపాధ్యాయుడు వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉండి టీడీపీ ఆఫీసుకు వెళ్లడంపై వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉపాధ్యాయునిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహించిన ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ జరిపించారు. నివేదిక ఆధారంగా ఉపాధ్యాయుడు వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యా శాఖాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. వెంకటేశ్వరరావు తాడంకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు.
ఇదిలాఉంటే.. ఉపాధ్యాయుడు వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను తెలుగుదేశం నాయకులు తీవ్రంగా ఖండించారు. గతంలో వైసీపీ కార్యాలయం కోసం వెంకటేశ్వరరావు తన ఇంటినే ఇచ్చాడని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిపై సస్పెన్షన్ వేటు వేడయం దారుణం అన్నారు. కాగా, ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ప్రభుత్వ చర్యను ఖండించారు. బాధిత ఉపాధ్యాయుడికి టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.