భారమైన ముసలితనం.!

అల్లారుముద్దుగా ఎత్తుకొని పెంచిన కన్న తండ్రినే అత్యంత కర్కశంగా ఒక కొడుకు చావబాదిన సంఘటన అనంతపురం నగరంలో వెలుగుచూసింది. నగరంలోని హౌసింగ్ బోర్డ్ కు చెందిన లక్ష్మీనారాయణ మ్యారేజ్ బ్యూరో నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. లక్ష్మీనారాయణకు హర్షవర్ధన్ అనే కుమారుడు ఉన్నాడు. హర్షవర్ధన్ మున్సిపల్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు.అయితే తండ్రికి ఉన్న ఒక్కగానొక్క ఇల్లు అమ్ముకుని ఆ డబ్బుతో మరొకచోట ఇల్లు కట్టించుకున్నాడు. అప్పులు ఎక్కువ కావడంతో తండ్రిపై ఒత్తిడి తెచ్చాడు. ఇంటికి తాళాలు వేసి తండ్రిని ఒక రూమ్ లో బంధించి రోకలిబండతో ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు. భోజనం తినే ప్లేట్ ను కూడా కాలితో తంతూ చిత్ర హింసలకు గురి చేసేవాడు. ఒళ్లంతా కందిపోయే లక్ష్మీనారాయణ నడవలేని స్థితికి చేరుకున్నాడు. కొడుకు అరాచకాన్ని భరించలేక లక్ష్మీనారాయణ టూ టౌన్ పోలీసులను ఆశ్రయించాడు. రెండు నెలలపాటు స్టేషన్ చుట్టూ తిరిగినా అక్కడ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇవాళ జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చాడు. ఎస్పీ సత్య యేసు బాబు వద్ద తన మొరను వినిపించాడు. కొడుకు నుంచి తనను రక్షించాలని కన్నీరుమున్నీరయ్యాడు. జీవితంలో ఇలాంటి కొడుకు ఎవరికీ ఉండకూడదని ఆవేదన వ్యక్తం చేశాడు.

Leave A Reply

Your email address will not be published.